వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించాలి : మంత్రి తుమ్మల

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో విస్తృత అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Tummala) తెలిపారు. తెలంగాణా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FTCCI) ఆధ్వర్యంలో కేఎల్ఎన్ ఆడిటోరియం, ఫెడరేషన్‌ హౌస్‌, రెడ్‌హిల్స్‌‌లో నిర్వహించిన వ్యవసాయ ఎగుమతులపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో APEDA, DGFT అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOs) సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ, వ్యవసాయ అభివృద్ధి విధానాల ఫలితంగా తెలంగాణ దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందని తెలిపారు. అదే సమయంలో ఉద్యానవన పంటల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిందని, పండ్లు, కూరగాయలు, పసుపు, మిర్చి వంటి పంటలకు దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉన్నట్లు వివరించారు. ఉత్పత్తి పెంపుతో పాటు రైతులకు మెరుగైన ధరలు అందేలా చేయడం, కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను విస్తరించడం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లాలంటే కేవలం ఉత్పత్తి పెరగడం మాత్రమే సరిపోదని, గ్రేడింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, అంతర్జాతీయ నాణ్యత ప్రమాణాలు కూడా అత్యంత అవసరమని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి (Revanth Reddy)  నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు.

అందులో భాగంగానే ఖమ్మం జిల్లా బుగ్గపాడు వద్ద మెగా ఫుడ్ పార్క్ ద్వారా ఆధునిక ప్రాసెసింగ్ సదుపాయాలు, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి అవకాశాలు కల్పించిందని వివరించారు. దీని ద్వారా రైతుల పంటలకు మెరుగైన మార్కెట్ లభించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ఉద్యానవన పంటల ఎగుమతులకు అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి (Minister Tummala) పేర్కొన్నారు. సరైన సరఫరా వ్యవస్థలు, ప్యాక్ హౌసులు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తే రాష్ట్రం అంతర్జాతీయ మార్కెట్లలో మరింత ముందుకు వెళ్లగలదని అన్నారు. ఈ దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని, అదే సమయంలో రైతుల ప్రయోజనాలను కాపాడటం కూడా ఎంతో ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు.

Read Also: మూసీ ప్రాజెక్ట్ DPR ఎక్కడ?: రేవంత్ కు హరీశ్​ 8 ప్రశ్నలు

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>