కలం, వెబ్ డెస్క్ : మూసీ ప్రాజెక్ట్ పేరుతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం కాకుండానే వేలాది మంది పేదల ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన సిద్ధమవుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసలు ప్రాజెక్ట్ విధివిధానాలపై స్పష్టత లేకుండానే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ముఖ్యంగా బాపూఘాట్ నుంచి హిమాయత్ సాగర్ వరకు డీపీఆర్ తయారీకి కనీసం 18 నెలల సమయం పడుతుందని గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని హరీశ్ రావు గుర్తు చేశారు. నివేదిక తయారీకి అంత సమయం పడుతుందన్నప్పుడు, ఇప్పుడు ఏ ప్రాతిపదికన పేదల ఇళ్లకు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. అసలు ప్రభుత్వం చేయబోయేది మూసీ ప్రక్షాళనా లేక కేవలం సుందరీకరణా అనే విషయంలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రాజెక్ట్ (Musi Project) పేరుతో సుమారు 10,017 ఇళ్లను కూల్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసిందని, ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది సామాన్యులు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌లో క్షిపణుల దాడి వల్ల ఇళ్లు కూలుతుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. దేశవ్యాప్తంగా బుల్డోజర్ సంస్కృతిని వ్యతిరేకించే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణలో కొనసాగుతున్న ఈ బుల్డోజర్ రాజ్ పై సమాధానం చెప్పాలని హరీశ్ రావు (Harish Rao) డిమాండ్ చేశారు.
Read Also: ఏడుపాయల ఆలయాన్ని తాకిన గ్యాస్ కొరత..!
Follow Us On: X(Twitter)

