కలం, వెబ్ డెస్క్ : శాసనసభ పరిసరాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై మంత్రి సీతక్క (Minister Seethakka)తీవ్రంగా స్పందించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అనుచితంగా, అసభ్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని విజువల్స్‌ను విడుదల చేసిన సీతక్క.. అందులో మహిళా ఎమ్మెల్యేల పట్ల కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ప్రస్తావించారు.
విజువల్స్ విడుదల చేసిన మంత్రి సీతక్క
బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి పట్ల గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి అనుచితంగా వ్యవహరించారని సీతక్క ఆరోపించారు. అసెంబ్లీ గేటు ముందు మహిళా ఎమ్మెల్యేలు పక్కపక్కనే నిల్చున్న సమయంలో గంగుల కమలాకర్, సుధీర్ రెడ్డి వారి మధ్యలోకి వెళ్లడం, వెనుక నుంచి నెట్టడం వంటి దృశ్యాలు విజువల్స్‌లో కనిపిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని మంత్రి ప్రశ్నించారు. రాజకీయంగా నిరసన వ్యక్తం చేయడానికి అనేక ప్రజాస్వామ్య మార్గాలు ఉన్నాయని, అయితే మహిళా ఎమ్మెల్యేల పట్ల భౌతికంగా దూకుడుగా వ్యవహరించడం సమర్థనీయం కాదని అన్నారు.
మహిళా ఎమ్మెల్యేల భద్రతపై ప్రశ్నలు
మహిళా ఎమ్మెల్యేల మధ్యకు చొరబడాల్సిన అవసరం ఏమొచ్చిందని, వారిని తాకుతూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని సీతక్క ప్రశ్నించారు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం, సంయమనం పాటించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలను వెనుక నుంచి నెట్టుకుంటూ వెళ్లిన సందర్భంలో వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు కూడా మంత్రి పేర్కొన్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మాపై నిందలా?: సీతక్క ఫైర్
ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరం ఉంటే ధర్నా చేయవచ్చని, స్పీకర్‌ను కలిసి తమ సమస్యలను వివరించవచ్చని సీతక్క అన్నారు. అంతేకానీ సభా ప్రాంగణంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలే సొంత మహిళా ఎమ్మెల్యేలపై అనుచితంగా ప్రవర్తించారని మంత్రి తెలిపారు. వాళ్లే కీచకపర్వం సృష్టించి తమపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్క తాజా వ్యాఖ్యలపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రం అయ్యే అవకాశం కనిపిస్తోంది.

