ఆడుతుండగానే ఆగిన గుండె.. రఘునాథపాలెం బీసీ గురుకులంలో విషాదం!

కలం, ఖమ్మం బ్యూరో: మైదానంలో తోటి మిత్రులతో కలిసి ఉత్సాహంగా ఆడుకుంటున్న ఆ బాలుడి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. చిరునవ్వులు చిందిస్తూ గడపాల్సిన వయసులో మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ విద్యార్థిని అనంత లోకాలకు తీసుకెళ్లింది. ఖమ్మం (Khammam) జిల్లా రఘునాథపాలెం (Raghunadhapalem) మండలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల (Gurukul School) లో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

​పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న సాత్విక్ (14) అనే విద్యార్థి ఉదయం పూట రోజువారి మాదిరిగానే గ్రౌండ్‌లో ఆటలాడుతున్నాడు. అంతా సజావుగా సాగుతోందనుకున్న సమయంలో సాత్విక్ ఒక్కసారిగా ఊపిరి అందక స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు కేకలు వేయడంతో ఉపాధ్యాయులు, నిర్వహణ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, ఆసుపత్రికి చేరుకునే లోపే మార్గమధ్యలోనే సాత్విక్ ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

​ఆటలాడుతున్న సమయంలో తీవ్రమైన గుండెపోటు రావడం వల్లే బాలుడు మృతి చెంది ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతి చెందిన సాత్విక్ తిరుమలాయపాలెం మండలం కకరవాయి గ్రామానికి చెందిన హరీష్, ప్రియాంక దంపతుల కుమారుడు. చేతికి అందివచ్చే వయసులో ఉన్న కుమారుడు ఆకస్మికంగా కన్నుమూశాడన్న వార్త వినగానే కకరవాయి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కంటిపాపలా చూసుకుంటున్న బిడ్డ ఇక లేడన్న సత్యాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు ప్రతీ ఒక్కరినీ కలచివేసింది. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన మిత్రుడు కళ్లముందే ప్రాణాలు వదలడంతో గురుకుల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు సమాచారం అందుకొని విచారణ చేపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>