కలం, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan)పై మంత్రి సవిత (Minister Savitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆయన సీఎం కావాలనుకున్నప్పటి నుంచి శవ రాజకీయాలే చేస్తున్నారని ఆరోపించారు. తండ్రి శవంతో రాజకీయం చేయడం, బాబాయి గొడ్డలి పోటును చూశామని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్సీ ఓ దళిత బిడ్డను చంపి డోర్ డెలివరీ చేస్తే జగన్ ఆయనను నెత్తిన పెట్టుకుంటున్నారని చెప్పారు. జగన్‌కు హత్యలు చేయడం, సాక్షుల్ని బెదిరించడం అలవాటేనన్నారు.
ఇలాగే జడ్జిలు, పోలీసులను కూడా బెదిరిస్తారని ఆరోపించారు. ఇదే పద్ధతిలో ఎమ్మెల్సీ అనంతబాబు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పారు. జగన్‌కు చంపడం అలవాటని, గుండాల్ని తయారు చేసే ఫ్యాక్టరీగా వైసీపీ తయారైందని అన్నారు. హంతకులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని సవిత హెచ్చరించారు. సాక్ష్యులు కూడా ధైర్యంగా ఉండాలని సూచించారు. టీడీపీ స్వర్ణాంధ్ర కోసం మంచి నాయకులను తయారు చేస్తుంటే, వైసీపీ హంతకులను, రౌడీలను తయారు చేస్తోందన్నారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలని సూచించారు. వైసీపీ నాయకుల వల్ల బీసీలు, దళితులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

