శాంతియుత వాతావరణంలో సమ్మె నిర్వహించుకోవాలి: సీపీ సాయి చైతన్య

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్‌ (Nizamabad) లో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో చట్టాన్ని కాపాడటం పోలీస్ శాఖకు ప్రధాన ప్రాధాన్యత అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మె (RTC Strike) ను ప్రజాస్వామ్య పరమైన హక్కుగా గౌరవిస్తున్నప్పటికీ, అది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. సమ్మె కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు , ఉద్యోగులు, అత్యవసర సేవలు వినియోగించే ప్రజలు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్, రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ప్రైవేట్ డ్రైవర్లు తాత్కాలికంగా విధుల్లోకి వచ్చినా, అలాగే ఆర్టీసీ డ్రైవర్లు తిరిగి డ్యూటీలో చేరినా, వారికి ఎటువంటి బెదిరింపులు లేకుండా పూర్తి స్థాయిలో పోలీస్ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

బస్టాండ్ పరిసరాల్లో అదనపు బందోబస్తు

బస్సుల రాకపోకలు, డిపో ప్రాంతాలు, ముఖ్య కూడళ్లు బస్టాండ్ పరిసరాల్లో అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం, అధికారులపై దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, వదంతులు వ్యాప్తి చేసిన వారిపైనా పర్యవేక్షణ కొనసాగుతోందని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కూడా చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమ్మెలో పాల్గొనే కార్మికులు, ప్రజలు పరస్పర గౌరవం పాటిస్తూ, ఎలాంటి ఉద్రిక్తతలకు తావు లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా అల్లర్లు చేసిన, ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై నాగర్ కర్నూల్, కామారెడ్డి, ఖమ్మం మొదలగు జిల్లాలలో డిపో మేనేజర్‌లకు తదుపరి చర్యలు తీసుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కావున ఎవరు కూడా ఎలాంటి శాంతి భద్రతల విఘాతం కలగకుండా సమ్మె నిర్వహించుకోవాలని సూచించారు. నిజామాబాద్ ప్రజల శాంతి భద్రతలను కాపాడటంలో పోలీస్ శాఖకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>