కలం, ఖమ్మం బ్యూరో: ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ భరోసా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్తో కలిసి తిరుమలాయపాలెం మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేయడంతో పాటు, సన్న ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి దశలవారీగా పక్కా ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. పర్యటనలో భాగంగా పాపాయిగూడెంలో రూ.2.40 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, జూపెడలో రూ.20 లక్షలతో నిర్మించనున్న నూతన పంచాయతీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మేడిదపల్లిలో బస్ షెల్టర్‌తో పాటు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

