కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రుద్రారం జాతీయ రహదారిపై క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ అనుమానాస్పద మృతి చెందారు. తోటి డ్రైవర్ల కథనం ప్రకారం.. రాజశేఖర్ ఐటీ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నిన్న రాత్రి తన ఆఖరి డ్రాప్ ముగించుకుని ఇంటికి బయలుదేరే క్రమంలో గంట వ్యవధిలోనే రాజశేఖర్ కనిపించడం లేదంటూ డ్రైవర్ల వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన తోటి డ్రైవర్లు అంతా కలిసి వెతకడం ప్రారంభించారు. జీపీఎస్ సమాచారం ఆధారంగా వెతకగా, రాజశేఖర్ వాహనం జహీరాబాద్ సమీపంలో లభ్యమైంది. వెంటనే అక్కడికి వెళ్లి గాలించగా, రుద్రారం పరిసర ప్రాంతాల్లో రాజశేఖర్ మృతదేహాన్ని కనుగొన్నారు. శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని, ఎవరో దారుణంగా దాడి చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మృతిని భార్య, కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని అంబుటెన్స్ లో పటాన్ చెరుకు తరలించగా.. ఆ తర్వాత అక్కడి నుంచి మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ కు తరలించారు.

