Mobile Popup Ad
Mobile Popup Ad

​ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగానికి పెద్దపీట: మంత్రి పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వంలో విద్యుత్ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి (Minister) పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం (Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండల కేంద్రంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 0.8 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రానికి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. గత రెండున్నరేళ్ల కాలంలో ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే విద్యుత్ శాఖ పరిధిలో రూ.37.38 కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

​”గతంలో విద్యుత్ సమస్యల వల్ల రైతాంగం, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాత్రి వేళల్లో కరెంట్ ఇవ్వడం వల్ల పొలాల దగ్గరకు వెళ్లిన ఎంతో మంది రైతులు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. నాడు మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ అందించి అండగా నిలిచారు. నేడు మా ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ను అందిస్తోంది.” అని మంత్రి పేర్కొన్నారు.

​పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధనం) వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే తిరుమలాయపాలెంలో సోలార్ పవర్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అలాగే ఇళ్లపై నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైన్ల వల్ల దశాబ్దాలుగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్న ప్రజల సమస్యలను ప్రజా ప్రభుత్వం పరిష్కరిస్తోందని, నియోజకవర్గంలో రూ.9 కోట్ల వ్యయంతో మూడు కొత్త సబ్‌స్టేషన్ల పనులు కూడా చేపట్టినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసచారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>