కలం, ముధోల్: రెవెన్యూ అధికారుల తప్పిదాలు, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ముధోల్ నియోజకవర్గంలోని వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ముధోల్ మండలం రాంటెక్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో (Revenue Grama Sabha) పాల్గొని మాట్లాడారు. కొంతమంది రైతులకు మాయమాటలు చెప్పి వారి భూములను పంజాబ్ కంపెనీకి విక్రయించేలా చేశారని ఆరోపించారు. ఒక రైతు కంపెనీకి రెండు ఎకరాలు విక్రయిస్తే, అదే సర్వే నంబరులోని ఇతర రైతుల భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడం ఏమిటని ప్రశ్నించారు.
తానూరు, ముధోల్ మండలాల్లో వందలాది మంది రైతులు సుమారు 15 ఏళ్లుగా రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారని తెలిపారు. రాంటెక్ గ్రామంలో రైతులు పంజాబ్ కంపెనీకి 37 ఎకరాల 20 గుంటలు విక్రయించగా, మొత్తం 295 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చినట్లు పేర్కొన్నారు. అలాగే వెంకటాపూర్ గ్రామంలో 35 ఎకరాలు విక్రయించగా, 152 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చడంతో 152 మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.
ఈ రెండు గ్రామాల్లో రైతుబంధు అందక రైతులు సుమారు రూ.3.60 కోట్ల మేర నష్టపోయారని తెలిపారు. తానూరు మండలంలోనూ వేలాది ఎకరాలకు ఇదే సమస్య ఉందని, రైతులకు సుమారు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. రైతుల భూముల సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో మాట్లాడినట్లు తెలిపారు. బాధిత గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని, నిషేధిత జాబితా నుంచి అర్హులైన రైతుల భూములను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

