మహర్షి వాల్మీకి ఆశయాలు సమాజానికి మార్గదర్శకం: ఎస్పీ జానకి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహర్షి వాల్మీకి (Maharishi Valmiki) జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ఆయన రచించిన రామాయణం తరతరాలకు ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను బోధిస్తోందని మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మహర్షి వాల్మీకి జయంతి వేడుకల సందర్భంగా ఎస్పీ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి జీవితం పరివర్తనకు ప్రతీక అని పేర్కొన్నారు. పురాణ కథనాల ప్రకారం.. రత్నాకరుడిగా ఉన్న సమయంలో దారి దోపిడీలకు పాల్పడిన ఆయన, సప్తర్షుల బోధనలతో తన జీవితాన్ని విశ్లేషించుకుని సన్మార్గాన్ని ఎంచుకున్నారని ఆమె తెలిపారు. నిరంతర తపస్సు, సాధనతో మహర్షిగా ఎదిగి, రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని వివరించారు.

మనిషి గతంలో చేసిన తప్పులను గుర్తించి, వాటిని సరిదిద్దుకుంటూ మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వాల్మీకి జీవితం చాటిచెబుతోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన, క్రమశిక్షణ, నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తిగత అభివృద్ధితో పాటు సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలని సూచించారు.

మహర్షి వాల్మీకి బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రాసంగికమని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా మంచి సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఆర్‌ఐలు కృష్ణయ్య, నగేష్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>