భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులపై పొంగులేటి సమీక్ష

కలం, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ బాసర నుంచి భద్రాచలం వరకు ప్రత్యేక ఆలయ పర్యాటక మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు ఇదే వేగంతో కొనసాగితే నిర్దేశిత గడువు కంటే సుమారు పది రోజుల ముందే పూర్తి చేయగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

గురువారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్న అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట తదితర అధికారులతో కలిసి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉత్తర ద్వార దర్శనం పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్ అండ్ బి, దేవాదాయ శాఖల ఉన్నతాధికారులు ప్రతి వారం సమీక్షలు నిర్వహిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారని తెలిపారు. కొన్ని స్లాబుల నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రాతి కట్టడాలకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. నవంబర్ 15 నుంచి రాతి కట్టడాల పనులు ప్రారంభించి, వాటిని ప్రతిష్ఠించే ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో కాంక్రీట్ మాడవీధుల పనులు కూడా కొనసాగుతాయని తెలిపారు. గోదావరి పుష్కరాలకు లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రాచలం ఆలయంతో పాటు పుష్కర ఘాట్లను సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొండపై రాతిని తొలగించే పనులను స్థానికులకు ఇబ్బందులు కలగకుండా, నాణ్యతా ప్రమాణాలతో చేపడుతున్నట్లు వివరించారు.

భద్రాచలం పట్టణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ఇందుకు సంబంధించిన అంచనాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు, పనులను త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆలయంతో పాటు పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్న అధికారులు, సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి శాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>