కలం, వెబ్ డెస్క్: దీపావళి పర్వదినం సమీపిస్తున్న వేళ అయోధ్యలోని రామాలయం (Ayodhya Ram Temple) సర్వాంగసుందరంగా ముస్తాబైంది. రంగురంగుల విద్యుద్దీపాలతో బంగారు వర్ణంలో మెరిసిపోతూ గురువారం రాత్రి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. అడుగడుగునా ఆధ్మాత్మిక భావన ఉట్టి పడుతోంది. ఈ మేరకు ఆలయ ట్రస్ట్ విడుదల చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీపావళి నాడు శ్రీరాముడికి స్వాగతం పలకడం అయోధ్యలో ఆనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సందర్భంగా సరయూ నదీ తీరాన నిర్వహించే దీపోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతుంది. భక్తులు శ్రీ రాముడి దర్శనానికి భారీగా తరలివస్తుండగా.. ఆలయ క్షేత్ర ట్రస్ట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అత్యంత పవిత్రంగా నిర్వహించే దీపోత్సవంలో భక్తులు కూడా భాగస్వామ్యం కావాలని ట్రస్ట్ పిలుపునిచ్చింది.

