కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా కూసుమంచి (Kusumanchi) మండల పర్యటనలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గురువారం లింగారం తండాలో పర్యటించిన ఆయన రైతు అవతారమెత్తి పొలంలోకి దిగి ఎద్దుల అరక పట్టి దుక్కి దున్నారు. అనంతరం రైతులతో ముచ్చటించి, వ్యవసాయ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మండలంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.6.74 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులలో రాజుపేట బజార్, ఈశ్వరమాధారం, తాళ్లగడ్డ తండా, లింగారం తండాలలో బీటీ రోడ్ల నిర్మాణం, చౌటుపల్లి గ్రామంలో రూ.3.20 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి పనులు ఉన్నాయి.
గిరిజన ప్రాంతాలలో రోడ్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల అభివృద్ధి బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని తెలిపారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నామని, పాలేరు భూ రీ-సర్వే నిర్వహించి నకిలీ పాస్‌బుక్‌లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. రాబోయే నెలల్లో రాష్ట్రంలోని భూ సమస్యలను పరిష్కరించి, అర్హులైన ప్రతి రైతుకు పట్టాదారు పాస్‌బుక్ అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : ఖమ్మంలో భారీగా గంజాయి ధ్వంసం
Follow Us On : WhatsApp

