epaper
Wednesday, February 18, 2026
epaper

ఫోన్ ట్యాపింగ్‌లో కొత్త ట్విస్ట్.. చేస్తున్నదెవరు? ఎక్కడ?

కలం, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సిట్ (SIT) దర్యాప్తు జరుపుతున్న సమయంలోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో (Khammam) చేసిన కామెంట్లు సరికొత్త మలుపు తీసుకున్నట్లయింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు సహా పలువురిని విచారించి వారి స్టేట్‌మెంట్లను సిట్ ఇప్పటికే రికార్డు చేసింది. మరోమారు కేటీఆర్, హరీశ్‌రావును పిలిచే అవకాశమున్నది. దర్తాప్తు ముమ్మరంగా జరుగుతుండగా ఇంకా ట్యాపింగ్ కొనసాగుతూనే ఉందంటూ మంత్రి పొంగులేటి తన అనుమానాన్ని వ్యక్తం చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఈ కామెంట్లు పొలిటికల్ మైలేజ్ కోసమా?.. బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడానికా?.. ప్రభుత్వం చేపట్టబోయే కార్యాచరణకు సంకేతమా?.. ప్రభుత్వం మరింత సీరియస్‌గా ఉంటుందని చెప్పడానికా?.. ఇలాంటి అనేక రకాల చర్చలు మొదలయ్యాయి.

మంత్రి మాటల్లో మర్మమేంటి? :

బీఆర్ఎస్ ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ చర్యలకు పాల్పడుతున్నదనే అనుమానాన్ని మంత్రి పొంగులేటి (Minister Ponguleti) వ్యక్తం చేయడం రకరకాల ఊహాగానాలు తావిచ్చింది. స్వయంగా ఆయన మాటలనే రికార్డు చేస్తున్నదనే అభిప్రాయానికి వచ్చారంటే ఆయన తదుపరి యాక్షన్ ఎలా ఉండబోతున్నది?.. సిట్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుందా?.. త్వరలోనే ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయా?.. వీటికి రానున్న రోజుల్లో క్లారిటీ రానున్నది. ఇప్పటికీ బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదని కామెంట్ చేయడం వెనక సూత్రధారులు ఎవరన్నది తేలాల్సి ఉన్నది. ఎక్కడి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదో, ఆ ఎక్విప్‌మెంట్ ఎక్కడ ఉన్నదో, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారో, అది ఎవరి ఆధీనంలో ఉన్నదో, ఎన్ని చోట్ల నుంచి ఈ ప్రాసెస్ జరుగుతున్నదో.. ఇవన్నీ వెలుగులోకి రావాల్సి ఉన్నది.

ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) ఎక్విప్‌మెంట్ ఎవరిది? :

గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కోసం వాడిన ఎక్విప్‌మెంట్ ప్రభుత్వం ధనంతో కొనలేదని, పార్టీ నిధులతో కొన్నారన్నది పోలీసుల అనుమానం. పార్టీ డబ్బు ఖర్చు చేసినందువల్లనే ఆ వివరాలు పూర్తిగా బహిర్గతం కాలేదు. బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ ఎక్విప్‌మెంట్ ఎక్కడికి వెళ్లింది, ఫంక్షనింగ్‌లోనే ఉన్నదా, దాన్ని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీ తెలిసినవారెవరు, ఎవరి ఫోన్లు టార్గెట్… ఈ వివరాలను రాబట్టడం కీలకం. ఇటీవల బీఆర్ఎస్ నేతల ఎంక్వయిరీ సందర్భంగా ఎక్విప్‌మెంట్ ఎక్కడి నుంచి కొన్నారు.. ఎంతకు కొన్నారు.. ఇప్పుడు అది ఎక్కడున్నది.. పార్టీ నిధులతో కొనాల్సిన అవసరమేమొచ్చింది.. ఇలాంటి ప్రశ్నలు వేసినట్లు తెలిసింది. వారి నుంచి పోలీసులకు లభించిన సమాచారం గోప్యంగానే ఉండిపోయింది. ఇలాంటి సమయంలో మామిడి తోటలు, ఫామ్ హౌజ్‌లు అంటూ మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రభుత్వానికి, ఇంటెలిజెన్స్ కు తెలియదా? :

ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్‌ నిజమే అయితే ఇంటెలిజెన్స్ ఎందుకు పసిగట్టలేకపోయింది?.. రెండేండ్లుగా జరుగుతున్నా గోప్యంగానే ఎందుకు ఉండిపోయింది?.. ఇంటెలిజెన్స్ వైఫల్యం కింద పరిగణించాలా?.. ఆ కారణంగానే ప్రభుత్వానికి సైతం తెలియలేదా?.. హిల్ట్ పాలసీ లాంటిది ముందుగా లీక్ అయినప్పుడైనా గుర్తించలేదా?.. మంత్రి చెప్పేంతవరకూ ఇది బైటకు ఎందుకు పొక్కలేదు?.. ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే ఉండిపోయాయి. మంత్రి చెప్తున్నట్లుగా బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ వాస్తవమే అయితే అటు ఇంటెలిజెన్స్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిందలు భరించక తప్పదు. ప్రతిపక్షమే సీక్రేట్ ఆపరేషన్ చేస్తూ ఉంటే చేతిలో అధికారమున్నా ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైందనేది కూడా కీలకమైన అంశంగా మారుతుంది.

Read Also: దీపక్​​ టు మహ్మద్​ దీపక్​.. ​జిమ్​కు భారీగా తగ్గిన కస్టమర్లు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>