కలం, వెబ్ డెస్క్: ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ (PM Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే ఏపీలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు తమ కాన్వాయ్‌లను తగ్గించుకున్నారు. ఇక ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మరో అడుగు ముందుకేసి సైకిల్‌పై ప్రయాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయన ఏకంగా 14 కిలో మీటర్లు సైకిల్ పై ప్రయాణించి తన వ్యక్తిగత పనులు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయన పాలకొల్లు నుంచి తన సొంత గ్రామం అగర్తిపాలెంకు ఏడు కిలోమీటర్ల మేర సైకిల్‌పై వెళ్లారు. అక్కడ తన రొయ్యల చెరువులో మేత వేసి, రొయ్యల ఎదుగుదలను స్వయంగా పరిశీలించారు. పొలంలో కార్మికులతో కలిసి ట్రాక్టర్ దుక్కి దున్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి శ్రమదానంతో నిర్మిస్తున్న హిందూ స్మశాన వాటిక పనులను పర్యవేక్షించారు. సెలవు రోజు సొంత వ్యవసాయ పనుల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని మంత్రి పేర్కొన్నారు.
అగర్తిపాలెం నుంచి తిరిగి సైకిల్‌పై పాలకొల్లు వస్తుండగా, రోడ్డు వెంబడి జలజీవన్ మిషన్ పైప్‌లైన్ పనులను గమనించినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్తులో పైప్‌లైన్ మరమ్మతులు చేయాల్సి వస్తే ఇప్పుడు మంజూరైన సిమెంట్ రోడ్డుకు ఎటువంటి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడికక్కడే ఆర్ అండ్ బి ఇంజనీర్లను ఆదేశించామన్నారు. ఇలా మంత్రి మొత్తం 14 కిలో మీటర్లు సైకిల్ ప్రయాణించారు. ప్రజాప్రతినిధిగా అధికారిక పనులతో బిజీగా ఉన్నా.. సామాన్యుడిలా సైకిల్‌పై ప్రయాణిస్తూ అటు ఇంధన పొదుపుపై అవగాహన కల్పిస్తూ, ఇటు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనుల నాణ్యతను పర్యవేక్షించడంపై రాష్ట్ర ప్రజలను నిమ్మలను అభినందిస్తున్నారు.

