కొండా సురేఖపై వేటు..? AICC గ్రీన్ సిగ్నల్!

కలం, తెలంగాణ బ్యూరో : వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రి కొండా సురేఖ (Konda Surekha) కు త్వరలో ఉద్వాసన తప్పదా?.. ఆమెకు ‘డాటర్ స్ట్రోక్’ తగలనుందా? ముఖ్యమంత్రి లండన్ నుంచి వచ్చిన తర్వాత ఊహించని మార్పులు జరగనున్నాయా?.. వీటన్నింటికీ అటు ప్రభుత్వ, ఇటు కాంగ్రెస్ వర్గాల నుంచి ‘ఔను’ అనే సంకేతాలే వస్తున్నాయి. కొండా సురేఖతో ఇప్పటికే పార్టీకి, ప్రభుత్వానికి చాలా నష్టం జరిగిందని.. ఇకపైన ఉపేక్షిస్తే మరింత చేటు తప్పదని పార్టీ నేతలూ అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ ఏకవచనంతో పరుష పదాలతో కొండా సుష్మిత వ్యాఖ్యలు చేస్తే.. తల్లిగా, మంత్రిగా కొండా సురేఖ ఖండించకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. సురేఖను తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, పార్టీపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికైనా ముప్పేనంటూ తెలంగాణ కాంగ్రెస్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ 20 మంది ఎమ్మెల్యేలు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్సు పెట్టి అభిప్రాయాలను వెల్లడించారు. సుష్మిత కామెంట్ల వెనుక కొండా సురేఖ ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయని వారు తెలిపారు.

సీఎం తీసుకునే చర్యలపైనే ఉత్కంఠ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సుష్మిత తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తే దాన్ని తప్పుపట్టాల్సిన మంత్రి కొండా సురేఖ.. “ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతం.. నాకేం సంబంధం.. ఆ విషయంలో నాకెలా షోకాజ్ నోటీసు ఇస్తారు. దాన్ని ఉపసంహరించుకోవాలి” అంటూ వ్యాఖ్యానించడం మరింత వేడిని రాజేసినట్లయింది. సురేఖను తప్పించాలంటూ పార్టీ లీడర్లు డిమాండ్ చేస్తున్న సమయంలో ఆ అభిప్రాయాల వెలుగులోకి రావడంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ నెల 23 అర్ధరాత్రి తర్వాత లండన్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎలా క్లోజ్ చేస్తారన్నది కీలకం. ఆమెను తప్పించాలని సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో వాటికి తగినట్లుగా నిర్ణయం తీసుకుంటారా?.. లేక ఏఐసీసీ నిర్ణయానికి వదిలేస్తారా?.. లేక వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా?.. ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మొత్తం పార్టీకి, యాంటీ-సీఎం స్వరం వినిపించేవారికి లెసన్‌గా ఉండే అవకాశమున్నది.
మరొకరు స్వరం పెంచకుండా ఉండేలా..!

కీలకమైన మంత్రి బాధ్యతల్లో ఉంటూ కుమార్తె వ్యాఖ్యలను ఖండించని కొండా సురేఖ విషయంలో పార్టీ, సీఎం కఠినంగా వ్యవహరించకపోతే అది మరొకరు ఇదే తీరులో స్వరం పెంచడానికి ఆస్కారం కల్పించినట్లవుతుందనే భావన లీడర్లలో నెలకొన్నది. అలాంటివి జరగకూడదంటే పార్టీ, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనే సంకేతం వెళ్లేలా కొండా సురేఖ విషయంలో యాక్షన్ సీరియస్‌గానే ఉంటుందన్న మాటలూ వినిపిస్తున్నాయి. గతంలో దేవాదాయ శాఖ కమిషనర్‌తో ఎమ్మెల్యే కడియం శ్రీహరి భేటీ అయిన సందర్భంగా మంత్రి కొండా సురేఖ చేసిన వాదన.. వివాదానికి దారితీసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చుకున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను స్వయంగా కలిసి వివరించారు.

అక్కినేని నాగార్జున విషయంలోనూ కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రభుత్వానికి మచ్చ తెచ్చారనే మాటలూ లీడర్లలో ఉన్నాయి. ఇకపైన ఇలాంటి వివాదాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలంటే ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడమే ఉత్తమం అని వారు అంటున్నారు. ఆ ప్రకారమే పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇరవై మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ మీట్ పెట్టడం వెనక ఉద్దేశం కూడా ఇదేనని తెలుస్తున్నది.

ఉద్వాసనకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్!

మంత్రివర్గం నుంచి కొండా సురేఖను తప్పించడానికి దాదాపుగా ఏఐసీసీ స్థాయిలో నిర్ణయం జరిగినట్లు తెలిసింది. రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న ఈ వ్యవహారంలో పీసీసీ నుంచి నివేదిక తెప్పించుకుని ఆమెను తప్పించాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ తరఫున క్రమశిక్షణా చర్యలపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశమున్నది. పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తప్పవనే మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నది.

గతంలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే టోన్‌లో ఉండడంతో ఆమె సారీ చెప్పడంతో పాటు ఆమె తరఫున మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జరిగిన పొరపాటు నుంచి పాఠం నేర్చుకోకపోగా ఇప్పుడు మరింత తీవ్ర స్వరంతో కామెంట్ చేయడం యాధృచ్ఛికం కాదని, ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం జరిగిన చర్యగానే పార్టీ లీడర్లు, పీసీసీ, ఏఐసీసీ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. వచ్చే క్యాబినెట్ సమావేశానికి ఆమె హాజరవుతారా?.. హాజరు కావద్దని ఆదేశాలు వెళ్తాయా?.. అప్పటివరకు ఉద్వాసన పూర్తవుతుందా?.. ఇలాంటివి కీలకంగా మారాయి.

చిన్నారెడ్డిపై వేటు?

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి వ్యతిరేకంగా చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు సైతం ఏఐసీసీ దృష్టికి వెళ్లాయి. ఇప్పటికే ఆయనకు తెలంగాణ పీసీసీ క్రమశిక్షణా కమిటీ నుంచి షోకాజ్ నోటీసు జారీ అయింది. దానికి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉన్నది. పార్టీ లైన్‌కు భిన్నంగా మాట్లాడినట్లు కమిటీ ఒక అభిప్రాయానికి వచ్చింది. ఇదే సమయంలో మేఘారెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి చిన్నారెడ్డి కామెంట్లను వివరించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సస్పెన్షన్ వేటు వేయాలని కోరినట్లు మేఘారెడ్డి మీడియాకు వివరించారు. సీనియర్ కాంగ్రెస్ లీడర్‌గా ఉంటూనే అంతర్గత ఫోరమ్‌లో మాట్లాడడానికి బదులు బహిరంగంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని పీసీసీ సీరియస్‌గా తీసుకున్నది. కొండా సురేఖతో పాటు ఆయనపైనా ఉద్వాసన వేటు పడే అవకాశం ఉన్నది. స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాధ్యతల నుంచి ఆయనను తప్పించే అవకాశమున్నది.

రాజగోపాల్‌రెడ్డికి షోకాజ్?

ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌రెడ్డి ఏ క్షణమైనా షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశమున్నది. అసెంబ్లీ వేదికగా మార్చి నెల మొదటి వారంలో అవినీతి, వివక్ష.. అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఆయన పంద్రాగస్టుకు ముందు, ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. రెడ్డి సామాజికవర్గానికి చెందినందువల్లనే ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంలేదా.. అంటూ బీసీ నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.

సోషల్ జస్టిస్ విషయంలో కచ్చితమైన పాలసీని రూపొందించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ సామాజికవర్గానికి చెందిన నేతల్లో అసంతృప్తి నెలకొనడం ఇబ్బందికర పరిణామాలకు దారితీస్తుందని నాయకత్వానికి సంకేతాలు వెళ్లాయి. ఇప్పటివరకూ నోటీసులు ఇవ్వకపోవడంతో మరింత నష్టాన్ని నివారించేందుకు తొందర్లోనే క్రమశిక్షణా కమిటీ నుంచి జారీ అయ్యే అవకాకాశాలున్నాయి. పార్టీ క్రమశిక్షణకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిపై ఉదాసీనంగా ఉండడం మంచిదికాదని, ఇది కేడర్‌కు నెగెటివ్ మెసేజ్ వెళ్తుందని నాయకత్వం భావిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>