Mobile Popup Ad
Mobile Popup Ad

హ్యామ్ రోడ్లతో మారనున్న తెలంగాణ రూపురేఖలు: మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ: హ్యామ్ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంతో తెలంగాణ రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట‌రెడ్డి (Minister Komatireddy) స్పష్టం చేశారు. సోమవారం నల్లగొండలోని ప్రకాశం బజార్‌లో ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి నూతన క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, ఎంపీ రఘువీర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి అనేది కేవలం ప్రయాణ సౌకర్యం కోసమే కాదు, పట్టణాలు, గ్రామాల ప్రగతికి అసలైన సూచిక అని మంత్రి (Minister Komatireddy) అన్నారు.

ఎక్కడైతే రహదారులు బాగుంటాయో.. అక్కడ పరిశ్రమలు ఏర్పాటు కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నారు. తద్వారా స్థానిక యువతకు, నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ‘హ్యామ్’ ప్రాజెక్టుకు నల్లగొండ జిల్లాలోని కనగల్ మండల కేంద్రంలో పైలాన్‌ను ఆవిష్కరించుకోవడం గర్వకారణమన్నారు. విజయవాడ – హైదరాబాద్ ఫోర్ లైన్ రహదారి కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని మంత్రి తెలిపారు. గుర్రంపోడ్ దాటిన తర్వాత 3 కిలోమీటర్ల పక్క నుంచి అమరావతి, బందర్ మీదుగా వెళ్లే గ్రీన్ ఫీల్డ్ సిటీ హైవే డీపీఆర్ పూర్తయి, ప్రస్తుతం టెండర్ల దశలో ఉందన్నారు. మన్ననూరు – శ్రీశైలం మధ్య 52 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మూడు నెలల్లో దీని డీపీఆర్ ఫైనల్ కానుందని, క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

సీఎం సభ సక్సెస్-ప్రజలకు కృతజ్ఞతలు

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభ ఊహించని రీతిలో విజయవంతమైందని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. సభకు ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ సభను ఘన విజయం చేసినందుకు ఉమ్మడి జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, ఎమ్మెల్యేలు బాలు నాయక్ (దేవరకొండ), కుందూరు జైవీర్ రెడ్డి (నాగార్జునసాగర్), బత్తుల లక్ష్మారెడ్డి (మిర్యాలగూడ), నల్లగొండ మున్సిపల్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేశ్, స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>