కలం, నల్లగొండ బ్యూరో: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది అత్యంత విలువైన హక్కు అని, ఆ హక్కును కాపాడుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. నల్లగొండ (Nalgonda) పట్టణంలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్స్ కోసం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడి ఓటు హక్కు పరిరక్షణ కోసం పోరాడుతున్నారని, అదే స్ఫూర్తితో బూత్ స్థాయిలో ప్రతి కార్యకర్త అప్రమత్తంగా పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఓటు చోరీ మాత్రమే కాదు.. సీటు చోరీ కూడా చేస్తోందన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి, తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. “మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో నిబద్ధతతో పని చేస్తున్న నాయకురాలు. ఆమె నిరాడంబర జీవితం గడుపుతూ ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలుస్తారు. తమిళనాడులో జన్మించి, మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ సభ్యురాలిగా గెలిచిన నాయకురాలు. బీజేపీకి బలం లేని చోట మూడో అభ్యర్థిని పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే” అని అన్నారు. ఓటర్ల జాబితాలో జరిగే లోపాలు, అక్రమాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ప్రమాదం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ఓటర్ల జాబితాలో జరిగే చిన్న పొరపాటు కూడా ఎన్నికల ఫలితాలను మార్చగలదని పేర్కొన్నారు.
అందువల్ల ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అత్యంత సీరియస్‌గా తీసుకొని, అర్హులైన ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా చూడాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ ఎస్ఐఆర్ చైర్మన్, పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరై బీఎల్‌ఏలకు మార్గనిర్దేశనం చేశారు. సమావేశంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నియోజకవర్గ సర్ పరిశీలకులు రామ్ జి, మేయర్ బుర్రి చైతన్య రెడ్డి, డిప్యూటీ మేయర్ అహ్మద్ అష్రఫ్ అలీ అమేర్, నల్లగొండ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జూకూరి రమేష్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరు లక్ష్మయ్య, బూత్ లెవెల్ ఏజెంట్స్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

