కలం, నిర్మల్: ప్రజాసేవను జీవిత ధ్యేయంగా చేసుకుని నిస్వార్థంగా పనిచేసిన మహానేత పొద్దుటూరి నర్సారెడ్డి (Podduturi Narsa Reddy) సేవలు చిరస్మరణీయమని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally) అన్నారు. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న పి. నర్సారెడ్డి విగ్రహానికి శనివారం ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడిగా, ప్రజాప్రతినిధిగా, మంత్రిగా నర్సారెడ్డి అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలకు విశిష్ట సేవలందించారని గుర్తు చేశారు.
స్వర్ణ ప్రాజెక్టు, దోనిగాం ప్రాజెక్టు, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్ ఐటీడీఏ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన చేసిన కృషిని మంత్రి ప్రస్తావించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా జీవించిన నర్సారెడ్డి ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీహరి రావు తదితరులు పాల్గొన్నారు.

