కలం, మెదక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ నిధులే దిక్కు అని.. తమ వద్ద డబ్బులు లేవని సాక్షాత్తు సీఎం రేవంతే చెప్పారని చేవెళ్ల ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) అన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో రైతు బతుకుతున్నాడంటే కేంద్ర ప్రభుత్వమే కారణమన్నారు. కాంగ్రెస్ నేతలు చిప్ప చేతిలో పట్టుకుని నిధుల కోసం దిల్లీకి పోయి కేంద్ర మంత్రులను కలిసి, మళ్లీ ఇక్కడకు వచ్చి కేంద్ర ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
ఎక్కువ ధాన్యం కొనుగోలు చేస్తున్నాం..
తెలంగాణకి ప్రధాని మోదీ ఏం చేశారని కొంతమంది అంటున్నారు, తెలంగాణ నుంచే ఎక్కువ ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తోందని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకి దేశంలోనే ఎక్కువగా యూరియా కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. యుద్ధ సంక్షోభంతో పెట్రోల్ రేట్లు సాధారణంగా పెరుగుతాయని, ప్రపంచంలో పెట్రో ధరలు పెంచని ఏకైక దేశం ఇండియా అని చెప్పారు. ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్‌లో పాల్గొనే సభను 10 లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నామని ఎంపీ కొండా విశేశ్వర్ రెడ్డి అన్నారు

