కలం ,మహబూబ్ నగర్ బ్యూరో : మహబూబ్ నగర్ (Mahabubnagar )నగరంలోని బోయపల్లిలో రూ.20 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, రూ.2.5 కోట్లతో నిర్మించిన బాలికల హాస్టల్‌ను రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. “నలుగురు కుటుంబ సభ్యులు బ్రతకడానికి నలభై లక్షల యువత భవిష్యత్తును నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు” అంటూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ పాలనతో మైనారిటీ పాఠశాలలు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నడవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. గతంలో గురుకుల పాఠశాలలకు 60 : 40 నిష్పత్తిలో నిధులు మంజూరు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పూర్తిగా వినియోగించలేదని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి చొరవతో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి నిధులు విడుదల చేయించామని తెలిపారు. ముఖ్యమంత్రి కృషితో ఈ పాఠశాల నిర్మాణం సాధ్యమైందని పేర్కొన్న ఆయన .. ఇంకా రెండు భవనాలు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. “మాటలతో కాదు – పనితో చూపించాలి” అనే సిద్ధాంతంతో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు మహబూబ్ నగర్‌లో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా యువతకు ఆధునిక శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. టాటా వంటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, అందులో 25 శాతం మైనారిటీ యువతకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు.
గత రెండున్నర సంవత్సరాలలో మహబూబ్ నగర అభివృద్ధికి రూ.2000 కోట్ల నిధులు తీసుకువచ్చామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. IIIT, లా, ఇంజనీరింగ్ కళాశాలలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు, శాశ్వత తాగునీటి వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. వచ్చే 10 సంవత్సరాల్లో మహబూబ్ నగరాన్ని అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మహబూబ్ నగరం అన్ని మతాల ప్రజల సొంతమని, ఐక్యతే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం రేషన్ కార్డులు, ఆరోగ్య బీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.
ఫ్యూచర్ సిటీ నిర్మాణం ద్వారా 40 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, దీనిని అడ్డుకునే విధంగా బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నాడు స్థాపించిన హైటెక్ సిటీ వలన సుమారు 20 లక్షల మందికి అన్నం దొరుకుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ , జిల్లా కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా, నగర మేయర్ శ్రీమతి గుమ్మాల మమత శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టిమ్రీస్ ప్రెసిడెంట్ ఫయీం ఖురేషి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.

