కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి (Karimnagar Road Accident) చెందినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎ. నిరంజన్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే, కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామానికి చెందిన విలాసాగరం కరుణాకర్ (37), తండ్రి రాజయ్య, కులం కుమ్మరి, వృత్తి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈనెల 14న తన ఇంటి నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన కూలీలను మొగ్దుంపూర్ గ్రామం వద్ద దింపి, తన ద్విచక్ర వాహనం నంబర్ TS 02 EX 8064 పై తిరిగి చామనపల్లి గ్రామానికి వెళ్తున్నాడు.
ఈ క్రమంలో కరీంనగర్ – పెద్దపల్లి ప్రధాన రహదారిపై రాత్రి సుమారు 8.00 గంటల సమయంలో ద్విచక్ర వాహనాన్ని అధిక వేగంతో నడుపుతూ ఉండగా వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో కరుణాకర్‌కు తీవ్ర రక్తగాయాలు కాగా, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా కరీంనగర్‌లోని భద్రకాళి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో శనివారం ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో కరుణాకర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య విలాసాగరం మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

