కలం, వెబ్ డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డి (Jeevan Reddy)పై హస్తం నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన అవమానాలు, సీఎం వ్యవహార శైలిపై జీవన్ రెడ్డి తరచూ విమర్శలు చేస్తున్నారు. దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) స్పందిస్తూ జీవన్‌రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని తిట్టొద్దని హెచ్చరించారు. సీఎం రేవంత్‌ను ఏమైనా అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరన్నారు. విధానాలపై మాట్లాడాలి కానీ నోటికొచ్చినట్లు తిట్టొద్దన్నారు. రేవంత్ రెడ్డి లిమిటెడ్ కంపెనీ అని చేస్తున్న వ్యాఖ్యలపై అడ్లూరి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులు మేమే రాజులం అంటూ వ్యవహరించిన రోజుల్లో రేవంత్ నాయకత్వంలో ఎదురించి పోరాడమన్నారు. జగిత్యాలలో అందరం కలిసి పాదయాత్ర కూడా చేశామని గుర్తు చేశారు. ఇంత కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, రేవంత్ సీఎం అయ్యాక రెండేళ్లకు కుట్రలు చేసి ఇలా వ్యవహరిస్తున్నారని అడ్లూరి (Adluri Laxman) మండిపడ్డారు. జీవన్ రెడ్డి రాష్ట్రంలో ఎందుకు మార్పు కోరుకుంటున్నారని అడ్లూరి ప్రశ్నించారు. పేద వాళ్లకు రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంట్, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు మార్పు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో తిరుగుతామని, ప్రజలకు చేసిన మంచి గురించి చెప్పుకుంటామని, మీలాగా జిమ్మిక్కుల మాటలు మేం మాట్లాడమంటూ జీవన్ రెడ్డిని విమర్శించారు.
Read Also: చంద్రబాబుపై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
Follow Us On: Instagram

