కలం, సత్తుపల్లి: మధ్యాహ్న భోజన పథకంలో సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని (Centralized Kitchen System) రద్దు చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు (Midday Meal Workers) సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా చేపట్టిన ఈ ఆందోళన అనంతరం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని క్యాంపు కార్యాలయ సిబ్బందికి అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులు గత 23 సంవత్సరాలుగా అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటూ వేలాది మంది విద్యార్థులకు భోజనం వండి అందిస్తున్నారని తెలిపారు. అలాంటి కార్మికుల ఉపాధికి ఇబ్బందులు కలిగించేలా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని అమలు చేయాలని భావించడం సరికాదన్నారు.
ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచాలని, మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని కోరారు. కార్మికులను విధుల్లో కొనసాగిస్తూ వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, కార్మికులందరికీ గుర్తింపు కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కోరారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బిల్లులతో పాటు మెనూ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులను తక్షణమే విడుదల చేయాలని స్పష్టం చేశారు. బహిరంగ మార్కెట్లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా ప్రభుత్వం చెల్లించే రేట్లను సవరించాలని డిమాండ్ చేశారు.
కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, మధ్యాహ్న భోజన పథకాన్ని కార్మికులకు న్యాయం జరిగే విధంగా కొనసాగించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు గుదే రాజ్యలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి మహాదేవ లక్ష్మి, పి. సీత, జరీనా, శ్రీలక్ష్మి, జీవ, మాణిక్యం, నాగలక్ష్మి, సుజాత, నాగమ్మ, సక్కుబాయి, చంటమ్మ తదితరులు పాల్గొన్నారు.

