కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ నగరాన్ని(Warangal Urban) సాంకేతిక పరిజ్ఞానంతో సుస్థిరంగా అభివృద్ధి చేసేందుకు జీడబ్ల్యూఎంసీ, ఎన్ఐటీ వరంగల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్పాయ్ సమక్షంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి బుధవారం ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ భాగస్వామ్యంలో(GWMC–NIT Partnership) భాగంగా నగర మౌలిక సదుపాయాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, స్మార్ట్ పట్టణ ప్రణాళిక, పర్యావరణహిత అభివృద్ధికి ఎన్ఐటీ సాంకేతిక సహకారం అందించనుంది. జీడబ్ల్యూఎంసీ ఇంజినీర్లు, అధికారులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పరిశోధన ఆధారిత పరిష్కారాలను అమలు చేసేందుకు కృషి చేయనున్నారు.
విద్యాసంస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని పట్టణ పరిపాలనకు అనుసంధానించడం ద్వారా నగర సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు లభిస్తాయని చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. ఎన్ఐటీ నిపుణుల సలహాలు, పరిశోధన ఫలితాలతో పనుల నాణ్యతను పెంచి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందిస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న తెలిపారు. స్వల్పకాలిక కోర్సులు, సాంకేతిక శిక్షణకు ప్రాధాన్యం ఇస్తామని ఎన్ఐటీ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటీ డిప్యూటీ డైరెక్టర్ ప్రొఫెసర్ రతీష్ కుమార్తో పాటు ఇరు సంస్థల అధికారులు పాల్గొన్నారు.

