కలం, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్దనున్న మిడ్ మానేరు (శ్రీరాజరాజేశ్వర) రిజర్వాయర్ (Mid Manair Reservoir) నిండిపోవడంతో శుక్రవారం ఉదయం అధికారులు నీటిని దిగువకు విడుదల చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం 9:30 గంటలకు ప్రాజెక్టుకు చెందిన 4 స్పిల్‌వే రేడియల్ గేట్లను పైకి ఎత్తి, 2,000 క్యూసెక్కుల నీటిని (2000 Cusecs Water Released) దిగువ మానేరు (LMD) జలాశయానికి తరలిస్తున్నారు.
ప్రాజెక్టు నీటిమట్టం పెంపుతో ముందస్తు చర్యలు
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో రిజర్వాయర్ నీటిమట్టం సురక్షిత స్థాయి అయిన 316.66 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్ట్ భద్రతను దృష్ట్యా, ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. వరద తీవ్రతను బట్టి గేట్ల సంఖ్యను, నీటి విడుదలను పెంచే అవకాశం ఉందని తెలిపారు.
అధికారుల హెచ్చరిక
మానేరు వాగు పరివాహక ప్రాంతాలు, దిగువన ఉన్న గ్రామాల ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు వాగులోకి దిగవద్దని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, స్థానిక యంత్రాంగం నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తోందని స్పష్టం చేశారు.

