కలం మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు నడిరోడ్డుపై పరస్పరం దాడులు చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చెట్ల కొమ్మలను తొలగిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో ఇరు శాఖల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించేందుకు విద్యుత్ శాఖ కార్మికులు పనులు చేపట్టారు. ఇందులో భాగంగానే మెదక్ పరిధిలో విద్యుత్ వైర్ల కింద ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మలను నరుకుతుండగా.. ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకుని పనులను నిలిపివేయాలంటూ అడ్డుకున్నారు. ముందస్తు అనుమతి లేకుండా చెట్లను ఎలా నరుకుతారంటూ అటవీ శాఖ సిబ్బంది విద్యుత్ కార్మికులను ప్రశ్నించారు.
ఈ క్రమంలో ఇరు శాఖల అధికారుల మధ్య మాట మాట పెరిగింది. అక్కడే ఉన్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) సాయి, విద్యుత్ కార్మికులపై తీవ్ర పదజాలంతో దూషిస్తూ బూతులు తిట్టడంతో వివాదం కాస్తా ముదిరింది. విధి నిర్వహణలో ఉన్న తమను దూషిస్తారా? అని విద్యుత్ సిబ్బంది కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదం ముదిరి కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఇరు శాఖల అధికారులు, కార్మికులు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. నడిరోడ్డుపైనే ఇరువర్గాలు నెట్టుకుంటూ, భౌతిక దాడులకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వానికి చెందిన రెండు కీలక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాల్సింది పోయి, ఇలా రోడ్డుపై కొట్టుకోవడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘర్షణ కారణంగా అటు విద్యుత్ లైన్ క్లియరెన్స్ పనులు నిలిచిపోగా, ఈ గొడవపై మెదక్ ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

