చెక్‌పోస్ట్‌లో అక్ర‌మ వ‌సూళ్లు.. కానిస్టేబుల్‌పై చర్యలకు నివేదిక

కలం, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలబత్​పూర్ ఎక్సైజ్ చెక్ పోస్ట్ (Salabathpur Checkpost) వద్ద కానిస్టేబుల్స్​ వసూళ్ల దందా దేశ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కానిస్టేబుల్స్​ రాజస్థాన్​కు చెందిన రెండు భారీ ట్రక్కులను ఆపి ఒక్కొక్క లారీ నుంచి రూ.200 చొప్పున వసూలు చేసేందుకు యత్నించారు. లారీలో ప్రయాణిస్తున్న యూట్యూబర్ దీన్ని ప్రశ్నిస్తూ ఫోన్​లో రికార్డ్ చేశాడు. దీన్ని సోషల్​ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్​గా మారింది.

లారీలో ఉన్న వ్యక్తి ఎన్ని డబ్బులు ఇవ్వాలి అని అడగ్గా.. రూ.200 ఇవ్వాలని కానిస్టేబుల్ చెప్పాడు. మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అని యూట్యూబర్ ప్ర‌శ్నించాడు. దీనికి కానిస్టేబుల్‌ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా చెక్ పోస్టులు లేవ‌ని, ఆర్టీఓ చెక్ పోస్ట్ బంద్ ఉంద‌ని, మొత్తం తెలంగాణకు ఇదే బార్డర్ చెక్ పోస్ట్ అంటూ సమాధానం ఇచ్చారు. మద్నూర్ దగ్గరే చెక్ పోస్ట్ ఉంది, మేమే డబ్బులు తీసుకుంటున్నాం అని కానిస్టేబుల్ సమాధానం ఇచ్చినట్లు వీడియోలో ఉంది.

దీంతో లారీని ఆపిన యూట్యూబర్ “మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఎప్పుడు ఇలాగే అడుగుతున్నారు? ఇది మంచిది కాదు” మీ అధికారిని పిలవండి అంటూ మొత్తం సంఘటనను వీడియో తీసి ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ లలో పోస్ట్ చేశారు. ఆ వీడియో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో కామారెడ్డి ఎక్సైజ్ జిల్లా అధికారి స్పందించి గురువారం విలేకరులతో మాట్లాడారు. సలబత్‌పూర్ వద్ద చోటుచేసుకున్న ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి తెలిపారు.

వీడియో వైరల్ కావడంతో వెంటనే విచారణ ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి పాత్రను గుర్తించినట్లు చెప్పారు. ఈ అంశంపై శాఖాపరమైన పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది. విచారణ నివేదికను కరీంనగర్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, నోడల్ అధికారికి సమర్పించనున్నారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సదరు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని సిఫారసు చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు ముకుంద రెడ్డి వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>