మూడేళ్లలో డంపింగ్ యార్డు ఖాళీ.. మహబూబ్‌నగర్ ప్రజలకు భారీ ఊరట!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: లక్షకు పైగా జనాభా ఉన్న పట్టణాల్లో చెత్త నిర్వహణ ప్రధాన సమస్యగా మారుతోందని, దీనివల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) అన్నారు. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం స్థానిక సంస్థల బాధ్యత అని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేట సమీపంలో ఉన్న డంపింగ్ యార్డులో పేరుకుపోయిన పాత వ్యర్థాల తొలగింపు పనులను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డంపింగ్ యార్డులో దాదాపు 7.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని తెలిపారు. గతంలో నగరానికి దూరంగా ఉన్న ఈ ప్రాంతం ప్రస్తుతం నగర విస్తరణతో జనావాసాలకు దగ్గరైందని, దీంతో దుర్గంధం, కాలుష్యం, విషవాయువులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చి, మూడు యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చెత్తను వేర్వేరుగా విభజించి, పునర్వినియోగ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించడం, సేంద్రియ వ్యర్థాలతో ఎరువులు తయారు చేయడం, ప్లాస్టిక్‌ను వేరు చేయడం వంటి చర్యలు చేపడతామన్నారు.

మహబూబ్‌నగర్‌కు ప్రతిరోజూ 100 నుంచి 110 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని తెలిపారు. రాబోయే రెండేళ్ల నుంచి మూడేళ్లలో పాత చెత్తను పూర్తిగా తొలగించడమే లక్ష్యమన్నారు. వర్షాకాలానికి ముందే పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మైత్రి యాదయ్య, కార్పొరేటర్లు ఫకృ, మోసిన్, యాదగిరి, రమేష్, అనుప ఆంజనేయులు, ఫయాజ్, రఘు, సత్యం, ప్రశాంత్, రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>