బుగ్గ ఫారెస్ట్‌లో కలప దొంగల బీభత్సం.. విధ్వంసంపై గ్రామస్తులు కన్నెర

కలం, మునుగోడు: నల్లగొండ జిల్లా మర్రిగూడ (Marriguda) మండల పరిధిలోని బుగ్గ ఫారెస్ట్‌లో అటవీ సంపదకు రక్షణ కరువైంది. దశాబ్దాల నాటి విలువైన మద్ది వృక్షాలను అక్రమార్కులు రాత్రివేళల్లో యథేచ్ఛగా కలపను దర్జాగా తరలిస్తున్నారు. గత 20 రోజులుగా ఈ అక్రమ కలప దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నా.. అటవీశాఖ అధికారులు నిద్రావస్థలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మర్రిగూడ మండలంలోని అజిలాపురం, ఖుదాబాక్సుపల్లి, వెంకేపల్లి గ్రామపంచాయతీల సరిహద్దుల్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ అక్రమ నరికివేత తీవ్రస్థాయిలో సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విలువైన మద్ది కలపను రాత్రికి రాత్రే ట్రాక్టర్లు, లారీల్లోకి ఎక్కించి హైదరాబాద్‌ తరలిస్తున్నట్లు సమాచారం.

అటవీ ప్రాంతంలో నిరంతరం నిఘా ఉంచాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే స్వయంగా రంగంలోకి దిగారు. అక్రమంగా కలపను రవాణా చేస్తున్న రెండు లారీలను నిలదీసి అడ్డుకోగా, మరో లారీ అక్కడి నుంచి పరారైంది. స్థానికులు అడ్డుకునే వరకు అధికారులకు సమాచారం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరికివేతకు గురైన ప్రాంతంలో వెంటనే ప్రత్యేక సర్వే నిర్వహించి, ఎంత విస్తీర్ణంలో ఎన్ని చెట్లను నరికేశారో స్పష్టమైన లెక్క తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. దీనికోసం డ్రోన్, శాటిలైట్ సాంకేతికతను ఉపయోగించి సమగ్ర విచారణ జరపాలన్నారు.

అటవీ సంపదను కొల్లగొడుతున్న ముఠా వెనుక ఉన్న సూత్రధారులను గుర్తించి, అక్రమ రవాణాకు వాడిన వాహనాలను స్వాధీనం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బుగ్గ ఫారెస్ట్‌ విధ్వంసంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమ దందాకు చెక్ పెడతారో లేదో వేచి చూడాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>