కలం, కరీంనగర్ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వంపై తీరుగుబాటు తప్పదని కేంద్రమంత్రి బడి సంజయ్ (Bandi Sanjay) హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరగకుండా ఉండేందుకే అసెంబ్లీలో కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వారిపై నమ్మకం పోయిందని అన్నారు. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే గణేశ్ నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సారెస్పీ కాలువలు, చెరువులు ఎండిపోయి వినాయక నిమజ్జనాలకు తీవ్ర అవాంతరం ఏర్పడుతోందని బండి ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో వినాయక విగ్రహాలను రోడ్లపైనే ఉంచాల్సి వస్తుందన్నారు. దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించాలని బండి (Bandi Sanjay) కోరారు.

