కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్ (Asian Games 2026) ప్రారంభానికి ముందే క్రీడా వేదికపై రాజకీయ వివాదం చోటుచేసుకుంది. తైవాన్ క్రీడా మంత్రి, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత లీ యాంగ్‌కు సంబంధించిన ఘటనపై ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు (OCA Chief) షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం జరగనున్న అధికారిక ప్రారంభోత్సవానికి కొన్ని గంటల ముందు ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లోకి రాజకీయాలను తీసుకురావద్దని స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి లీ యాంగ్‌ను తొలుత అనుమతించలేదు. దీనిపై తైవాన్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అయితే సాంకేతిక అవగాహనలోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని ఓసీఏ వివరణ ఇచ్చింది. అనంతరం లీ యాంగ్‌ను కార్యక్రమానికి అనుమతించింది.
చైనా తమపై చేస్తున్న హక్కు వాదనల నేపథ్యంలో తైవాన్ ఈ క్రీడల్లో ‘చైనీస్ తైపీ’ పేరుతో పాల్గొంటోంది. తమ హక్కులు, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికే తొలి ప్రాధాన్యం ఇస్తామని లీ యాంగ్ తెలిపారు. ఒలింపిక్ స్ఫూర్తికి అనుగుణంగా అన్ని దేశాల క్రీడాకారులకు సమాన గౌరవం దక్కాలని తైవాన్ ఒలింపిక్ కమిటీ కోరింది. క్రీడల నిబంధనలకు అనుగుణంగా ఆసియా గేమ్స్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు.

