కలం, దేవరకొండ : నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం పందిరిగుండుతండా (Pandirigundu Thanda) గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్యకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ (MLA Balu Naik) తక్షణ పరిష్కారం చూపించారు. తండాలో నీటి ఎద్దడిపై సమాచారం అందిన వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. ఇరిగేషన్, మిషన్ భగీరథ అధికారులను రంగంలోకి దించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అధికారులు పందిరిగుండుతండాకు చేరుకుని సమీపంలోని పెండ్లిపాకుల రిజర్వాయర్ నుంచి నీటిని మొండి కట్టల చెరువులో ఏర్పాటు చేసిన ప్రత్యేక బావిలోకి తరలించారు. అక్కడి నుంచి మోటార్ బోర్ల సహాయంతో తండాలోని ప్రతి ఇంటికీ తాగునీటిని సరఫరా చేశారు. దీంతో కొద్ది రోజులుగా నీటి కోసం ఇబ్బందులు పడుతున్న తండావాసులకు ఉపశమనం లభించింది.
తాగునీటి సమస్యపై వెంటనే స్పందించి అధికారులను పంపి పరిష్కరించడంపై పందిరిగుండుతండా సర్పంచ్, గ్రామస్తులు ఎమ్మెల్యే బాలునాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చొరవను అభినందించారు. భవిష్యత్తులో తండాలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల సమన్వయంతో నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

