కలం, వలిగొండ : యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా వలిగొండ (Valigonda) మండల కేంద్రంలో కుటుంబ అప్పుల భారం, మానసిక ఒత్తిడిని తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య(Married Woman Suicide) చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతురాలు దాసోజు రూప. మృతురాలి సోదరుడు పనుగంటి భాస్కరాచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు, తన బావమరిది దాసోజు వెంకటాచారి తమ్ముడు దాసోజు విష్ణు ఫోన్ చేసి రూప ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా, రూప మృతిచెందినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, బంగారు ఆభరణాల వ్యాపారం చేస్తున్న వెంకటాచారి గత మూడేళ్లుగా తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొని భారీ అప్పులలో కూరుకుపోయాడు. అప్పులు తీర్చలేక గ్రామం విడిచి వివిధ ప్రాంతాలలో తిరుగుతూ, అప్పుడప్పుడు మాత్రమే ఇంటికి వచ్చేవాడని తెలిపారు. ఇదే సమయంలో అప్పు ఇచ్చిన వారు తరచూ ఇంటికి వచ్చి డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో రూప తీవ్ర మానసిక వేదన, అవమానానికి గురై ఈ ఘాతుక నిర్ణయం తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వలిగొండ ఎస్ఐ యుగేందర్ గౌడ్ తెలిపారు.

