కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో విందు విషాదంగా మారింది. మంజీరా నదిలో (Manjeera River Tragedy) మునిగి నలుగురు గల్లంతు కాగా అందులో ముగ్గురి మృతదేహాలు వెలికితీశారు. బాన్సువాడ మండలం బుడ్మి వద్ద ఎల్లమ్మ పండుగ విందులో పాల్గొనడానికి పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పలువురు వెళ్లారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న మంజీరా నదిలో సరదాగా మహిళలు, పిల్లలు స్నానానికి దిగారు. అయితే లోతు తెలియక ఒక్కసారిగా నలుగురు నీళ్ళల్లో మునిగిపోయారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు మృతదేహాలు వెలికి తీశారు. అనిత (40), పావని (15), శివాని (13) ముగ్గురు మృతదేహాలను బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇందులో అనిత, శివానీ తల్లీకూతుళ్లు.. వారిద్దరూ లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామం నుండి వచ్చారు. పావని పిట్లం మండలం కిష్టాపూర్ వాసి. ఘటన జరిగిన సమయంలోనే పిట్లం మండలం గోద్మేగావుకు చెందిన భాను ప్రసాద్ (12) ను అక్కడ ఉన్న వారు నీళ్ళల్లో నుంచి బయటకు తీసి కాపాడారు. అతను బాన్సువాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అతని పరిస్తితి కూడా విషమంగా ఉంది. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో కిష్టాపూర్ పర్మల్ల గ్రామాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

