కలం, వెబ్ డెస్క్ : మణిపూర్ (Manipur)లోని చురాచంద్‌పూర్-కాంగ్‌వాయ్ రహదారిపై బుధవారం ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భద్రతా దళాలకు చెందిన మైన్ ప్రొటెక్టెడ్ వాహనం వెళ్తుండగా, మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం దానిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆర్మీ సిబ్బంది వారిని జిల్లా ఆసుపత్రికి తరలించగా, వైద్య పరీక్షల్లో వారు మద్యం సేవించి ఉన్నట్లు, వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని తేలింది.
అయితే, ఈ ఘటనను ఆసరాగా చేసుకుని కొందరు అసాంఘిక శక్తులు ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. భద్రతా దళాలు బాధ్యతాయుతంగా వ్యవహరించినప్పటికీ, ఆందోళనకారులు కేంద్ర సాయుధ పోలీసు బలగాల వాహనాలపై దాడులు చేసి, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించారు. ఈ అల్లర్ల కారణంగా సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నాయి.

