Mobile Popup Ad
Mobile Popup Ad

గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు తెగొద్దు: మేనకా గాంధీ విజ్ఞప్తి

కలం, వెబ్ డెస్క్: తిరుపతిలో గంగమ్మ జాతర సందర్భంగా జరిగే జంతు బలులపై కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ (Maneka Gandhi)  ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. ఈ నెల 18, 19 తేదీల్లో తిరుపతి గంగమ్మ ఆలయం వద్ద జరిగే జంతు బలులను తక్షణం నిషేధించాలని కోరారు. ప్రతి ఏడాది గంగమ్మ జాతర సమయంలో పెద్ద ఎత్తున జంతు బలులు జరుగుతున్నాయని, దీనిపై దేశవ్యాప్తంగా జంతు సంరక్షణ కార్యకర్తలు, సామాన్య ప్రజల నుంచి తనకు అనేక ఫిర్యాదులు, లేఖలు వచ్చాయని వెల్లడించారు. వేల సంఖ్యలో జంతువులను ఎలాంటి అవసరం లేకుండానే హతమారుస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి ఆచారాలు ఆధునిక సమాజంలో అనుచితమని, జంతు హింసను నియంత్రించే చట్టాలకు వ్యతిరేకమని మేనకా గాంధీ లేఖలో స్పష్టం చేశారు. జంతువుల పట్ల కరుణ, సంరక్షణ మన సమాజపు విలువలలో భాగమై ఉండాలని, అలాంటి హింసాత్మక ఆచారాలను నిలిపివేయడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అదే సమయంలో, తిరుపతి వంటి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరగడం మంచిది కాదని, రాష్ట్ర ప్రతిష్ఠకు కూడా ఇది అనుకూలం కాదని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి, స్థానిక అధికారులు, పోలీసు యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేసి జంతు బలులను అడ్డుకోవాలని మేనకా గాంధీ సీఎం చంద్రబాబును కోరారు. జాతర సమయంలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఈ లేఖతో తిరుపతి గంగమ్మ జాతరలో జంతు బలుల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు సంప్రదాయాలు, మరోవైపు జంతు సంరక్షణ ఈ రెండింటి మధ్య సమతౌల్యం ఎలా సాధించాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>