కలం, వెబ్ డెస్క్ : అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రతిష్ఠాత్మక గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (Global Horticulture Hub), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర రాష్ట్ర మంత్రులతో అనంత్ అంబానీ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. శంకుస్థాపన సభ వద్ద సీఎం చంద్రబాబుకు ఎదురెళ్లి నమస్కరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ రోజు (అక్టోబర్ 2, 2026) రాయలసీమ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని అన్నారు. సరైన సాగునీటి సౌకర్యం కల్పిస్తే సీమ ప్రజలు బంగారాన్ని పండించగలరని, యాపిల్స్ నుంచి స్ట్రాబెర్రీల వరకు ప్రతి పంటను పండించే సామర్థ్యం ఇక్కడి రైతులకు ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి సహకారం అందిస్తూ, ఏది అడిగినా తక్షణమే నిధులు మంజూరు చేస్తున్నారని సీఎం కొనియాడారు.

