ఆడపిల్ల పుడుతుందనే అనుమానం.. భార్య, కుమార్తెలను చంపేసిన వ్య‌క్తి

క‌లం, వెబ్ డెస్క్‌: హన్మకొండ (Hanumakonda) జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగుచూసింది. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో అజారుద్దీన్ అనే వ్యక్తి తన భార్య ఫర్హాత్ (26), కుమార్తెలు ఉమేరా (8), అయేషా (6)లను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అజారుద్దీన్‌ పున్నేలు గ్రామ శివారులో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇప్పటికే అత‌డికి ఇద్దరు కుమార్తెలున్నారు. గతంలో భార్య రెండుసార్లు గర్భం దాల్చగా ఆడపిల్లలు పుడతారనే కార‌ణంతో అజారుద్దీన్ బలవంతంగా అబార్షన్ చేయించాడు. తాజాగా నాలుగేళ్ల తర్వాత ఫర్హాత్ మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి కూడా అబార్షన్ చేసుకోవాల‌ని అజారుద్దీన్ ఆమెను ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడు.

భార్య‌, కుమార్తెల‌ను చంపేయాల‌ని నిర్ణ‌యించుకున్న అజారుద్దీన్ ప్లాన్‌ ప్రకారం వాళ్ల‌ను త‌న‌ స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లాడు. అక్క‌డ వాళ్ల‌ను నీళ్లలోకి తోసేశాడు. ఈత రాక ఫ‌ర్హాత్ స‌హా పిల్ల‌లు మృతి చెందారు. అనంతరం ఈ దారుణాన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే ఫర్హాత్ తండ్రికి అజారుద్దీన్ ప్రవర్తనపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో గర్భంలో ఉన్నది ఆడపిల్ల అన్న అనుమానంతోనే తానే ఈ ముగ్గురిని చంపినట్లు అజారుద్దీన్ అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>