epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

22 రూపాయల కోసం హత్య

కలం, వెబ్ డెస్క్: ఇటీవల చిన్న చిన్న కారణాలకే మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కేవలం 22 రూపాయల కోసం ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా (Medak District) చేగుంట మండలం అనంతసాగర్‌లో చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ సిరాజ్ (30) బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చాడు. అదే రాష్ట్రానికే చెందిన మహేశ్ కుమార్ వర్మతో కలిసి ఒకే గదిలో నివాసం ఉంటున్నాడు. సంక్రాంతి పండుగ రోజు ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. గతంలో మహేశ్ వద్ద సిరాజ్ రూ.22 అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు కోసం వీరిద్దరూ గొడవ పడ్డారు. తన దగ్గర తీసుకున్న రూ. 22 ఇవ్వాలంటూ మహేశ్ అడిగాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదంగా మారింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన మహేశ్, సిరాజ్‌ను బలంగా కొట్టాడు. అనంతరం పక్కనే ఉన్న బండరాయిని తీసుకుని తలపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ దాడిలో సిరాజ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడు మహేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే ఈ హత్య చేసినట్లు అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ మీడియాకు తెలిపారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం స్వల్ప మొత్తానికి జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>