కలం, వెబ్‌డెస్క్: భారత్ నుంచి తమ జట్టు మ్యాచ్‌లను తరలించడంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (Bangladesh Cricket Board) పంతం వదలడం లేదు. ఈ నేపథ్యంలో బీసీబీ, ఐసీసీ మధ్య ప్రతిష్టంభన మరో దశకు చేరింది. టీ20 వరల్డ్‌కప్‌కు తమ జట్టు భారత్‌కు వెళ్లేది లేదన్న నిర్ణయాన్ని బీసీబీ మరోసారి స్పష్టంగా చెప్పింది. ఈ క్రమంలో కొత్త ప్రతిపాదన పెట్టింది. తమను వేరే గ్రూప్‌లోకి మార్చాలంటూ ఐసీసీని కోరింది. ఈ అంశంపై ఢాకాలో కీలక సమావేశం జరిగింది. ఐసీసీ అధికారి గౌరవ్ సక్సేనా వీసా ఆలస్యం కారణంగా ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు. ఆండ్రూ ఎఫ్గ్రేవ్ ప్రత్యక్షంగా హాజరయ్యారు. బీసీబీ తరఫున అమినుల్ ఇస్లాం సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
జట్టు భద్రతపై బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఉన్న ఆందోళనలను బీసీబీ వివరించింది. అభిమానులు, మీడియా భద్రతపై కూడా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న డిమాండ్‌ను మళ్లీ ముందుకు తీసుకొచ్చింది. అదే సమయంలో కనీస లాజిస్టిక్ మార్పులతో సమస్య పరిష్కారానికి బంగ్లాదేశ్‌ను వేరే గ్రూప్‌లో ఉంచే అవకాశాన్ని కూడా చర్చలో పెట్టింది.
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ ప్రస్తుతం గ్రూప్ సీ లో ఉంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో మూడు మ్యాచ్‌లు, ముంబై వాంఖడే స్టేడియంలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల కారణంగా, కోల్‌కతా జట్టు నుంచి ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను తప్పించడం ఈ వివాదానికి కారణమైంది. టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది వారాలే మిగిలి ఉండటంతో బీసీబీ (Bangladesh Cricket Board) ప్రతిపాదనలు ఐసీసీకి సవాలుగా మారుతున్నాయి.


