epaper
Monday, February 2, 2026
spot_img
epaper

బీజేపీకి మధ్యవర్తిలా సీఈసీ.. జ్ఞానేశ్​ కుమార్​పై​ మండిపడిన మమత

కలం, వెబ్​డెస్క్​: బీజేపీకి మధ్యవర్తిలా కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్​ కుమార్​​ పనిచేస్తున్నారని తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి, పశ్చిమ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు (Mamata Banerjee – CEC). బెంగాల్​లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్​ఐఆర్​) తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్​ బెనర్జీ, ఎంపీ కల్యాణ్​ బెనర్జీ, మరికొందరు పార్టీ ప్రముఖులు, 12 ‘సర్​’ ప్రభావిత కుటుంబాలతో కలసి ఆమె ఢిల్లీలోని సీఈసీ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల బృందాన్ని కలిశారు.

‘సర్​’ ప్రక్రియలోని లోపాలు, వాటి వల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరించడానికి సీఈసీ సిబ్బందితో సమావేశమయ్యారు. అయితే, సమావేశం నుంచి తన బృందంతో కలసి అర్ధంతరంగా బయటికి వచ్చిన మమత.. మీడియాతో మాట్లాడుతూ సీఈసీ జ్ఙానేశ్​ కుమార్​పై నిప్పులు చెరిగారు. తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ధోరణి జమీందారులా, అహంకారపూరితంగా ఉందని విమర్శించారు. తనతోపాటు తన బృందాన్ని ఆయన అవమానించారని ఆమె ఆరోపించారు. ఆయన తీరు వల్లే తాము సమావేశాన్ని బహిష్కరించామని చెప్పారు.

ఎన్నికల కమిషన్ ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మమతా బెనర్జీ మరోసారి ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఈసీ బీజేపీకి ‘దలాల్‌’(మధ్యవర్తి)లా పనిచేస్తోందని ఆమె ఆరోపించారు. ‘సర్’ వల్ల ఎంతో మంది చనిపోయారు. దానికి బాధ్యులెవరని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్​ బీజేపీ ఆదేశాల మేరకు పనిచేస్తోందని ఆమె ఆరోపించారు.

‘మాతో వాళ్లు చాలా చెడ్డగా ప్రవర్తించారు. న్యాయం కోసం వచ్చామని చెప్పాను. కానీ అది లభించలేదు. ఆయన పెద్ద అబద్ధాల కోరు. మమ్మల్ని అవమానించారు. ఇలాంటి ఎన్నికల కమిషర్​ను నేను ఎప్పుడూ చూడలేదు. చాలా అహంకారంతో ఉన్నారు. మేము సేవకులమన్నట్లు.. ఆయన జమీందారులా మాట్లాడుతున్నారు’ సీఈసీపై మమత ఘాటు వ్యాఖ్యలు చేశారు (Mamata Banerjee – CEC).

కాగా, ఎస్‌ఐఆర్ ప్రక్రియ వల్ల ఓటుకు దూరమైన కుటుంబాలకు చెందిన సుమారు 100 మందిని టీఎంసీ ఢిల్లీకి తీసుకువచ్చింది. వీరిలో చనిపోయారని ఓట్లు తీసేసిన వ్యక్తులూ ఉన్నారు. అలాగే ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన, ఆత్మహత్య చేసుకున్నవాళ్ల కుటుంబ సభ్యులూ ఉన్నారు.

బెదిరించేలా మాట్లాడారు.. సీఈసీ

మమత ఆరోపణలపై ఎన్నికల అధికారులు స్పందించారు. ఆమె చెప్పినవన్నీ అసంబద్ధం అని ఖండించారు. మమత అడిగిన ప్రశ్నలన్నింటికీ తాము సమాధానం చెప్పడం ప్రారంభించగానే ఆమె ఆగ్రహంతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారని చెప్పారు. టీఎంసీ ప్రతినిధులు ఎన్నికల కమిషన్​పై, ముఖ్యంగా సీఈసీపై బెదిరించేలా మాట్లాడారని వాళ్లు వెల్లడించారు. బెంగాల్​లో ఎన్నికల అధికారులపై టీఎంసీ కార్యకర్తలు, ఎమ్మెల్యేలు దాడులు, విధ్వంసానికి పాల్పడిన ఘటనలు కూడా ఉన్నాయని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>