కలం, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా అనంతరం కాస్త సైలెంట్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే (Abhijeet Dipke) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. తనకు రాజకీయ పార్టీల నుంచి బెదిరింపులు వస్తున్నాయని అభిజీత్ ఆరోపించారు. తమ పార్టీలో చేరాలంటూ బీజేపీ (BJP) కి చెందిన కొందరు వ్యక్తులు తనకు ఫోన్ కాల్స్ చేస్తున్నారని చెప్పారు.
బీజేపీలో చేరితేనే నీకు, నీ కుటుంబానికి మంచిదని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఉద్దేశిస్తూ అభిజీత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద పదవుల్లో ఉండి మీ మనవడి అంత వయసున్న నాకు ఇలాంటి బెదిరింపులు చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. మీకు ప్రజలు పదవులు ఇచ్చింది ఇందుకేనా? అని నిలదీశారు. బెదిరింపులకు గురి చేసినా, ప్రలోభపెట్టినా బీజేపీలో మాత్రం చేరేది లేదని స్పష్టం చేశారు.

