కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ పట్టణంలోని మల్లికా హాస్పిటల్ (Mallika Hospital) అధినేత డాక్టర్ మహేష్ బాబు అక్టోబర్ 30వ తేదీన సాయంత్రం ఒక రోగి కుటుంబంపై సభ్య సమాజం తలవంచుకునే విధంగా వ్యవహరించడం పట్ల సామాజిక ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని ఒక సమావేశ హాల్లో ప్రజాసంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ.. అక్టోబర్ 30న సామాజిక కార్యకర్త హనీఫ్ అహ్మద్ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో పరీక్షల నిమిత్తం మల్లికా హాస్పిటల్‌కి వెళితే, హాస్పిటల్ సిబ్బందితో పాటు హాస్పిటల్ యజమాని డాక్టర్ మహేష్ బాబు కూడా అత్యంత దురుసుగా, రౌడీయిజం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు.
పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ.. మల్లికా హాస్పిటల్ యాజమాన్యం కుటుంబ సభ్యులపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, సామాజిక మాధ్యమాలలో వారికి వ్యతిరేకంగా ప్రచారాలకు పూనుకోవడం పట్ల తీవ్రంగా ఖండించారు. హనీఫ్ అహ్మద్ వ్యక్తిత్వం మహబూబ్ నగర్ ప్రజలకు సుపరిచితమని, ఆయన కుటుంబ సభ్యులపై మల్లికా హాస్పిటల్ యాజమాన్యం చేసిన దౌర్జన్యం సహించరానిదన్నారు.
సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి డాక్టర్ మహేష్ బాబు పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇది ఒక్క హనీఫ్ అహ్మద్ సమస్యనే కాదు, మల్లికా హాస్పిటల్ పై అనేక ఆరోపణలు ప్రజల నుండి వస్తున్నాయని, వీటిని అధికారులు గమనించాలని ఆయన కోరారు. దీనిని ఇంతటితో వదిలిపెట్టకుండా భవిష్యత్ కార్యాచరణను రూపొందించి, డాక్టర్ మహేష్ బాబు పై చర్యలు తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.ఎం. ఖలీల్, సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త అన్వర్ పాషా, టఎఫ్టీయూ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పి. విజయకుమార్‌తో పాటు ప్రముఖ కవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాబర్ షేక్, ప్రముఖ సామాజిక నాయకులు, వ్యాపారవేత్త షేక్ సిరాజ్, అబ్దుల్ ఖదీర్ సేటు, ఆల్ పార్టీ మైనార్టీ నాయకుడు మోసిన్ ఖాన్, జమియతే ఇస్లామీ నాయకుడు ఖాలిద్ నవీద్, స్కూల్ స్వీపర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. గట్టన్న, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బాలకృష్ణ, తాకి హుస్సేన్ ఖాకి, మొహమ్మద్ ఇస్మాయిల్, ప్రముఖ ప్రజా గాయకులు జక్క గోపాల్, సయ్యద్ సికిందర్, జలాల్ పాషా తదితరులు పాల్గొన్నారు.

