కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో అడవి జంతువులను వేటాడి చంపి మాంసాన్ని అమ్ముతున్న ముఠా (Wildlife Hunting Gang)ను మల్కాజ్గిరి జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు నిఘా ఏర్పాటు చేసి శామీర్పేట వద్ద తనిఖీలు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నీల్గాయి మాంసం తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.. బొలెరో వాహనంలో తరలిస్తున్న 70 కిలోల మాంసం స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి లైసెన్స్డ్ గన్, ఎయిర్ గన్, టెలిస్కోప్, బుల్లెట్లు సీజ్ చేశారు. ఆదిలాబాద్ అడవుల్లో నీల్గాయిని వేటాడినట్లు పోలీసుల గుర్తించారు. అక్కడినుంచి తీసుకువచ్చి నగరంలో మాంసం విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడించారు.
నిందితులను సాల్మన్ రాజ్ అలియాస్ సునీల్, అఖిల్, ఆదినారాయణగా గుర్తించారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ పేరుతో పొందిన తుపాకుల లైసెన్సులను దుర్వినియోగం చేస్తున్నట్లు తెలిపారు. వీరిపై లైసెన్స్ దుర్వినియోగం, ఆర్మ్స్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం ముగ్గురికీ రిమాండ్ విధించింది. ఈ కేసుపై అనేక కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ముఖ్యంగా అడవి జంతువుల మాంసం కొనుగోలు చేసే వారి గురించి పోలీసులు సమాచారం రాబట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

