కలం, మక్తల్ : ప్రమాదవశాత్తు లారీ కింద పడబోయిన గొర్రెను కాపాడేందుకు వెళ్లి గొర్రెల కాపరి దుర్మరణం పాలైన సంఘటన నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలోని కాచ్ వార్ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఊట్కూరు మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన కురువ బాలరాజ్(35) గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మక్తల్ మండలంలోని కాచ్ వార్ వద్ద 167 వ జాతీయ రహదారిని గొర్రెల మందతో దాటే క్రమంలో అటుగా వెళుతున్న లారీ కిందకు గొర్రె పిల్ల వెళ్లబోయింది. దీంతో గొర్రెను ప్రమాదం నుంచి కాపాడే క్రమంలో పరిగెత్తిన బాలరాజు(Balaraj) పై లారీ దూసుకెళ్లడంతో బాలరాజు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
క్షణాల వ్యవధిలో జరిగిన ఈ దుర్ఘటనతో మిగతా కాపరులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై బాలరాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి బోరున విలపించారు. బాలరాజ్‌కు భార్య, ఏడేళ్ల లోపు కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు మక్తల్ ఎస్ఐ పి.రాజు తెలిపారు.

