నంబర్ ప్లేట్ లేని బైకులపై పోలీసుల కొరడా

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: జిల్లా ఎస్పీ డి. జానకి(D. Janaki) ఆదేశాల మేరకు నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలపై మహబూబ్‌నగర్ (Mahabubnagar) ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె. రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్లు లేకుండా, అస్పష్టంగా లేదా నంబర్‌లలో  మార్పులు చేసి తిరుగుతున్న వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వాహనదారులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act) ప్రకారం జరిమానాలు విధించి, అనంతరం వాహనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు లేదా చైన్ స్నాచింగ్‌లు, ఇతర నేరాలలో గుర్తింపు దొరకకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్లు లేకుండా లేదా నంబర్‌లను  మార్చి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలు చట్టవిరుద్ధమని, నేరాల దర్యాప్తులో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ప్రతి వాహనదారు తమ వాహనాలకు స్పష్టంగా కనిపించే రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>