కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలో భరోసా కేంద్రం నిర్వహణపై ఎస్పీ డి.జానకి సమీక్ష చేశారు. మహిళలు, చిన్నారులు, ఇతర బాధితులకు మెరుగైన సేవలు అందించేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, సామాజిక సంక్షేమ శాఖలు, న్యాయ సేవా సంస్థలు, ఛైల్డ్ లైన్, సఖి తదితర లైన్ డిపార్ట్మెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భరోసా కేంద్రానికి వచ్చే బాధితులకి అవసరమైన న్యాయ, వైద్య, మానసిక, సామాజిక, పునరావాస సేవలు ఒకే వేదికపై అందేలా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాధితుల సంక్షేమం విషయంలో ఆలస్యం లేకుండా స్పందించాలన్నారు. ప్రతి కేసును సున్నితంగా పరిశీలించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణ కేసుల్లో శాఖల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో DMHO శ్రీనివాస్, డీఎస్పీలు రమణా రెడ్డి, బాలాజీ, CWC ఛైర్మన్ నయీముద్దీన్, పీపీ జాన్, ఐసీడీఎస్ నర్మద, ఛైల్డ్ లైన్ అధికారి తదితరులు పాల్గొన్నారు.

