కలం, స్పోర్ట్స్: ఫిఫా వరల్డ్ కప్‌లో అల్జీరియాపై హ్యాట్రిక్‌తో అర్జెంటీనాకు 3-0 విజయం అందించిన లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ అనంతరం టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్‌తో తనకు కొన్ని విషయాల్లో పోలిక ఉందని తెలిపాడు. 38 ఏళ్ల మెస్సీ వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లోనే మూడు గోల్స్ చేసి అర్జెంటీనాకు శుభారంభం అందించాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ, ప్రస్తుతం నాదల్ డాక్యుమెంటరీని చూస్తున్నానని, నాదల్‌లాగే తాను కూడా శారీరకంగా ఫిట్‌గా ఉన్నంతకాలం ఆడాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తున్నానని, శరీరం సహకరిస్తే తన వంతు అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని చెప్పాడు.
గత కొంతకాలంగా మెస్సీ (Lionel Messi) భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమైనప్పటికీ, పూర్తిగా ఫిట్‌గా ఉన్న తర్వాతే ఈ వరల్డ్ కప్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ సీజన్‌లో ఇంటర్ మయామి తరఫున అద్భుత ఫామ్‌లో ఉన్న అతడు, వరల్డ్ కప్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. తన 39వ పుట్టినరోజుకు వారం రోజుల ముందు ఈ ఘనత సాధించిన మెస్సీ, వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ చేసిన అత్యంత వయసైన ఆటగాడిగా నిలిచాడు.

